తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత కలహాలు, NewzFast Telugu (తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, బహిరంగ విమర్శలు ఇప్పటికీ తగ్గడం లేదు. అధికారం సాధించి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా, కొంతమంది ప్రజాప్రతినిధులు మరియు నియోజకవర్గ స్థాయి నాయకుల తీరు పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాలుగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ నాయకత్వం నిత్యం హెచ్చరిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నా కొందరు నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు.
పత్రికలు, టీవీ మీడియాలో అధిష్ఠానానికి వ్యతిరేకంగా, ముఖ్య నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.
“మంచిని మైక్‌లో చెప్పండి, చెడును చెవిలో చెప్పండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి గత మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని సూచిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విభేదాలుంటే అంతర్గత సమావేశాల్లోనే ముఖ్య నేతలకు చెప్పాలని ఇటీవల టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేశారు.
అయినప్పటికీ మార్పు రాకపోవడం గమనార్హమని పార్టీలోని ఓ ముఖ్య నేత తెలిపారు. ఎమ్మెల్యేలే బహిరంగ వ్యాఖ్యలకు దిగడం మరింత ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చర్చనీయాంశంగా మారుతున్నారని పార్టీలోనే చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నిర్ణయాలు, ముఖ్య నేతల వైఖరిపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పలుమార్లు చర్చకు దారితీసింది.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలు, సొంత నియోజకవర్గంలోని విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారని, ఇది పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తెస్తోందని చర్చ ఉంది. డెవలప్మెంట్ అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆయన ఇటీవల చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి.
అలాగే ఎంపీ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చకు తెరలేపాయి.
ఈ పరిణామాల మధ్యలోనే జుక్కల్ ఎమ్మెల్యే అధికారంలో ఉండి కూడా ఒక సీనియర్ మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ కేంద్రంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, మంత్రి తనను దూషించారని ఆయన మీడియా ద్వారా ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల బహిరంగ విమర్శలు, ఆరోపణలను ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వినియోగించుకుంటున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, అంతర్గత వివాదాల వల్ల ప్రభుత్వ పనితీరు మరుగునపడుతోందని భావన ప్రజల్లో ఏర్పడుతోంది.
పాలనపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు, అంతర్గత కలహాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు సరిగా తీసుకోకపోవడమే నేతల అతిప్రవర్తనకు కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ అధిష్ఠానం వద్దకు పంచాయతీలు వెళ్లినా సర్దుబాటు మంత్రంతోనే సరిపెడుతున్నారని, ఈ వివాదాలు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని టీపీసీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో కీలక భేటీ నిర్వహించినట్లు కూడా సమాచారం ఉంది.




