నరసరావుపేట బైపాస్ రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (నరసరావుపేట, గుంటూరు జిల్లా): నరసరావుపేట పట్టణంలోని బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐరన్ లోడు లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
స్థానికుల కథనం ప్రకారం, బాధితులిద్దరూ రోజువారీ పనుల నిమిత్తం ఫిరంగిపురం నుంచి నరసరావుపేట పట్టణానికి బైక్పై వస్తుండగా డంపింగ్ యార్డ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఒకరు నరసరావుపేటలోని ఓ ఆసుపత్రి మెడికల్ షాపులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ ఎస్సై చల్లా కిషోర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




