ప్రకాశం జిల్లా ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం, NewzFast Telugu (ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్): ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. అర్థరాత్రి సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
అందిన వివరాల ప్రకారం, కడప నుంచి 33 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరిన ఈ బస్సు, వలేటివారిపాలెం మండలం చుండి గ్రామం సమీపంలోని హైవేపైకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోయింది.
టైరు పేలిన వెంటనే మంటలు చెలరేగి బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును పక్కకు ఆపి, అందులోని 33 మంది ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించారు.
దీంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.
సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన డ్రైవర్ సాహసాన్ని ప్రయాణికులు, స్థానికులు కొనియాడుతున్నారు.




