హైదరాబాద్ వాయు కాలుష్యం, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన నగరంలో ప్రస్తుతం గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయింది.
దీపావళిని పురస్కరించుకుని పటాసులు పేల్చడంతో ఈ నెల 8న నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఈ నెల 9 రాత్రి వరకు ఇది 185 ఏక్యూఐకి తగ్గింది.
పండుగ సమయంలో ఏర్పడిన ఈ పరిస్థితి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గాలిలోని సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 స్థాయి ఈ నెల 8న 223 మైక్రోగ్రాములకు చేరింది. సాధారణ పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా, పీఎం 10 స్థాయి 264 మైక్రోగ్రాములుగా నమోదైంది.
ఈ నెల 9న పీఎం 2.5 స్థాయి 104 మైక్రోగ్రాములకు, పీఎం 10 స్థాయి 129 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేసింది.
ఈ స్థాయిలు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా నమోదైంది. ఈ నెల 8న ఇందిరానగర్‌లో ఏక్యూఐ 229గా, ఏపీజీఓస్ కూప్ హెచ్‌ఎస్‌జీ సొసైటీ, జనార్దన హిల్స్‌లో 224గా, కూకట్‌పల్లిలో 222గా నమోదైంది.
చిత్రపురి కాలనీ, డీడీ కాలనీలో 215, ప్రకాశ్ నగర్‌లో 211, పోచమ్మ బాగ్ కాలనీలో 207, శిల్పవ్యాలీలో 206, చంచల్‌గూడలో 205, గోషామహల్‌లో 203గా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిసరాలు కాలుష్య హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
పండుగల సమయంలో పటాకులు కాల్చడం, వ్యర్థాలను తగలబెట్టడం తగ్గించాలని, వాహనాల వినియోగాన్ని కూడా నియంత్రించి ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.




