ఇన్స్టాగ్రామ్ ఏజ్ డిటెక్షన్, NewzFast Telugu: సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచేటప్పుడు చాలామంది తమ వయసు విషయంలో అబద్ధాలు చెబుతుంటారు. ముఖ్యంగా టీనేజర్లు తమ వయసును 18 ఏళ్లకు పైగా చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు.
దీంతో వారికి కనిపించే కంటెంట్, వచ్చే మెసేజ్‌లు కొన్నిసార్లు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఫేక్ ఏజ్ చెప్పినా గుర్తించేలా AI టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఇచ్చే పుట్టిన తేదీ ఆధారంగానే వయసును లెక్కించేవారు. ఇకపై అలా కాదు.
ఒక అకౌంట్ టీనేజర్ది అయ్యే అవకాశం ఉందని AI గుర్తిస్తే, ఆ అకౌంట్ వివరాల్లో పెద్దవారిగా వయసు చూపించినా టీన్ అకౌంట్ రక్షణలు అమలు చేస్తుంది. 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారికి తగిన భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం.
టీన్ అకౌంట్లలో అనవసరమైన మెసేజ్‌లు రాకుండా పరిమితులు, వయసుకు తగిన కంటెంట్ సూచనలు, స్క్రీన్ టైమ్ నియంత్రణ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 13 ఏళ్లలోపు పిల్లలు ప్లాట్ఫామ్లలోకి రాకుండా అడ్డుకోవడంపైనా మెటా దృష్టి సారించింది.
అమెరికాలోని తల్లిదండ్రుల కోసం ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ప్రత్యేక వీడియో చూపించనుంది. పిల్లల వయసును ఎలా గుర్తిస్తారు, ఆన్లైన్ భద్రత కోసం పేరెంట్స్ ఏం చేయాలి అనే అంశాలను ఇందులో వివరిస్తారు.
ఇదే తరహా రక్షణలను ఫేస్బుక్, థ్రెడ్స్‌లోనూ అమలు చేయాలని మెటా భావిస్తోంది.
పిల్లల ఆన్లైన్ సేఫ్టీపై టెక్ కంపెనీలు మరింత దృష్టి పెడుతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పవచ్చు.




