అల్లూరి జిల్లా మొసలి, NewzFast Telugu (అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం బందబయలు): అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బందబయలులో మొసలి కలకలం సృష్టించింది. వాగు ఒడ్డున మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చేపల వేటకు వెళ్లినవారికి మొసలి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా అది రాయిలా కనిపించిందని, దగ్గరికి వెళ్లిన తర్వాతే మొసలిగా గుర్తించారని స్థానికులు తెలిపారు.
వాగు గట్టుపైకి వచ్చి సేదతీరుతున్న మొసలిని కొందరు స్థానికులు ఫోటోలు తీశారు.
ఆ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారడంతో పరిసర గ్రామాల గిరిజనులు హడలెత్తిపోయారు. బంధబయలు నుంచి బోనకలమామిడి గ్రామాల మధ్య ఉన్న ఈ వాగుకు అవతలి వైపు బెన్నవరం, నక్కబొక్కల కొత్తూరు, బోనకలమామిడి, పోతురాజుగుమ్మాలు వంటి గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామాల ప్రజలు నిత్యం ఈ వాగును దాటుతూ రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల వచ్చిన తుఫాన్ల వరద ప్రవాహానికి మొసలి కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
వాగులో భారీ మొసలి కనిపించడంతో ఆందోళన మరింత పెరిగింది.
అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాగు దాటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




