బోర్‌వెల్ బండి ప్రమాదంలో వ్యక్తి మృతి, NewzFast Telugu (నాంపల్లి, నల్గొండ జిల్లా): బతుకుదెరువు కోసం బోర్‌వెల్ బండిపై పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల మండలం రేగులవరం తండాలో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన చిలకమర్రి ముత్తయ్య బోర్‌వెల్ బండిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మాచర్ల మండలం రేగులవరం తండాలో బోరు వేస్తుండగా, బోర్‌వెల్ బండికి సంబంధించిన ఎయిర్ పైపు ప్రమాదవశాత్తు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ముత్తయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య చిలకమర్రి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముత్తయ్య ఆకస్మిక మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
