మందమర్రి అభివృద్ధి ప్రణాళిక, NewzFast Telugu (మందమర్రి): మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
పట్టణంలోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేదలకు ఇళ్లు, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. సింగరేణి భూములను సేకరించి సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
శుక్రవారం బి-1 క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి 68 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మంజూరైన చెక్కులను రెండు రోజుల్లోగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలో రూ.7 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చిలోగా అనుమతులు సాధించి నిర్మాణ పనులు ప్రారంభించేలా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టామని, మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. సుమారు రూ.30 కోట్లతో ఇందిరా వాటర్ స్కీమ్, అమృత్ పథకాల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు.
మందమర్రి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏటీసీ శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. జర్మన్ భాషలో శిక్షణ కల్పించి విదేశాల్లో ఉద్యోగాలు పొందేలా అవకాశాలు ఇస్తున్నామని తెలిపారు.
