ఆశా మరియు ఎన్హెచ్ఎమ్ ఉద్యోగులకు ప్రమాద బీమా, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్రంలోని ఆశా వర్కర్లు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎమ్) ఉద్యోగులకు రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహజ మరణాలకు రూ.2 లక్షల బీమా కల్పించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఆశా, ఎన్హెచ్ఎమ్ సంఘాల ప్రతినిధులతో కూడా మంత్రి చర్చలు జరిపారు.
ఈ డిమాండ్‌పై ఆశా వర్కర్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ, పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.
రాష్ట్రంలో 27,130 మంది ఆశా కార్యకర్తలు, సుమారు 18 వేల మంది ఎన్హెచ్ఎమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులు కాకపోవడంతో వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు అందడం లేదు.
విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైనవారికి ఉచిత వైద్యం కూడా అందడం లేదని వివరించారు.
ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా ప్రమాద బీమా కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం లీడ్ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరిగాయి.
ఆశా, ఎన్హెచ్ఎమ్ ఉద్యోగుల వేతన ఖాతాలను ఈ రెండు బ్యాంకుల్లో ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఆశా కార్యకర్తలకు 120 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తున్నారు, ఆ కాలంలో వేతనం చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
అయితే ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది.
ఈ బీమా సౌకర్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జనవరిలోగా ఖరారు చేయనున్నారు.
బీమా, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, దీనికి రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఆశాలకు కనీస వేతనం రూ.18 వేలుగా ఉండాలని ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఎం.డి. మైముద ప్రభుత్వాన్ని కోరారు. 61 ఏళ్లు దాటిన ఆశాలను తొలగిస్తున్న అంశంపై కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు.
