మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ధర తగ్గింపు, NewzFast Telugu (హైదరాబాద్): ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరపై ప్రయాణికుల ఆగ్రహం నేపథ్యంలో రవాణాశాఖ దిగొచ్చింది. రూ.8,500 ఉన్న నెలవారీ కామన్ పాస్ ధరను రూ.4,000కు తగ్గించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు.
ఈ ప్రకటనను ఆయన వీడియో ద్వారా తన సందేశంలో తెలియజేశారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశాలతో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలు భారీగా తగ్గించామని ఆయన చెప్పారు.
రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ప్రస్తుతం ఉన్న రూ.400 నుంచి రూ.275కు తగ్గించినట్టు తెలిపారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీకి కేటాయించినట్టు వివరించారు.
ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది.
నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు తగ్గించినట్టు చెప్పారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు.
ఈ పాస్ ద్వారా నెలలో గరిష్ఠంగా 50 సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందని తెలిపారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి పరిమితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.

