ఏపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు 2026, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుండటంతో అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లోనూ టెన్షన్ మొదలైంది.
ఈసారి ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు బరిలో ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఎన్నికకు ముందే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి టెక్కలి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేశారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు జెడ్పీటీసీ స్థానానికి, మాజీ మంత్రి పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ నల్లచెరువు జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు.
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు వేర్వేరు జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేశారు. ఈ ఫలితాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర, మాజీ మంత్రి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య కూడా బరిలో ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి రేసులో వీరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
మొత్తంగా ఈ పరిషత్ ఎన్నికలు రాజకీయ కుటుంబాల ప్రతిష్ఠకు పరీక్షగా మారాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో ఎన్నికల ఫలితాలతో తేలనుంది.

