చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు, NewzFast Telugu (చీరాల): ఇటీవల జరిగిన చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 44 వార్డులకు గాను 42 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందిందని ఆమె తెలిపారు.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినప్పటికీ, ప్రతిపక్ష పాత్రను దక్కించుకోవడం పార్టీకి నైతిక విజయమని షర్మిల పేర్కొన్నారు. ఈ ఫలితాలు పార్టీ పునరుజ్జీవనానికి సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం చూపిన చొరవను షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వాన్ని ఆమె మెచ్చుకున్నారు.
అధికార కూటమి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాడిన వార్డు సభ్యులను, రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలను ఆమె అభినందించారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అధికార కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని, స్థానికంగా ప్రజా సమస్యలపై గెలిచిన వార్డు సభ్యులు ప్రజల గొంతుకగా నిలుస్తారని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.
