ప్రత్యేక ఎస్టీ కమిషన్ తెలంగాణ, NewzFast Telugu: తెలంగాణ రక్షణ సేన డిమాండుకు తలొగ్గి ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చిందని ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిపి ఒకే కమిషన్‌గా ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. ఈ అంశాన్ని పలుమార్లు ప్రశ్నించినట్లు ఆమె గుర్తుచేశారు.
ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సామాజిక, భౌగోళిక సమస్యలు పూర్తిగా వేర్వేరుగా ఉన్నాయని కవిత పేర్కొన్నారు. ఎస్సీలు ఇంకా పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గిరిజనులు జల్-జంగల్-జమీన్‌పై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఆదివాసీలు, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు మంచి చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త కమిషన్ గిరిజనుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవాలని, వారి ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.
