ఎఫ్ఎంజీ వైద్యుల స్టైపెండ్ ఆందోళన, NewzFast Telugu (హైదరాబాద్): స్టైపెండ్ పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు కోరుతూ ఆందోళన చేస్తున్న విదేశీ వైద్య విద్యార్థుల (FMG) ఇంటర్న్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలోని బోధనాసుపత్రుల్లో ఎఫ్ఎంజీ ఇంటర్న్లు విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్ మాత్రమే చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన శుక్రవారానికి 30వ రోజుకు చేరింది. కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.
జనవరి 2026 నుంచి పెండింగ్లో ఉన్న స్టైపెండ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఇంటర్న్షిప్ పొడిగింపు పేరుతో ఇబ్బందులు పెట్టకూడదని వైద్యులు కోరుతున్నారు. తమపై కక్షపూరిత చర్యలు తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డీఎంఈ అధికారులతో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. వైద్యులు, వైద్య రంగానికి చెందిన పలువురు సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
