రైతు సంఘం జాతీయ మహాసభలు నల్గొండ, NewzFast Telugu (లింగాల మండలం): నల్గొండ జిల్లాలో అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలు ఈనెల 15 నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతులను కోరుతూ లింగాల మండలంలోని రాయవరం గ్రామంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యా నాయక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతాంగం తిరుగుబాటు చేయక తప్పదని ఆయన హెచ్చరించారు.
15వ తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు.
రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, జిల్లాలో 20 మండలాలకు గాను 13 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని ఆయన చెప్పారు. మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వాణిజ్య పంటలకు ఎకరాకు 50 వేలు, ఆహార పంటలకు 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ కరువు మండలాలకు కేంద్రం 50 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిసిఐ, ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని రైతు సంఘం నాయకులు తెలిపారు. పండ్లు, కూరగాయలు, పత్తి, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా పోరాటం చేస్తామని చెప్పారు.
పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయ సబ్సిడీలు పెంచాలని, రైతులను రుణ విముక్తులను చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శంకర్ నాయక్ మరియు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

