కేసీఆర్ ఫామ్‌హౌస్ భూసర్వే నోటీసులు, NewzFast Telugu (సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ఎర్రవల్లి): తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ భూములను సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు.
ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని సరిహద్దులను, సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను పరిశీలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎర్రవల్లి గ్రామానికి చెందిన స్థానిక రైతులకు ముందస్తుగా సర్వే నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.
భూ కొలతలు, సరిహద్దుల నిర్ధారణలో భాగంగా ఇవాళ సాయంత్రంలోగా మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా అధికారులు ప్రత్యక్షంగా భూసర్వే నోటీసులు అందజేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఫామ్‌హౌస్ సరిహద్దులు, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం, క్షేత్రస్థాయిలోని పొజిషన్‌ను పరిశీలించడమే లక్ష్యంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
సర్వే నంబర్ 325లో దశాబ్దాలుగా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతులు సాగుచేసుకుంటున్న భూములను, ప్రభుత్వ భూములను ధరణి రికార్డులను మార్చి ఫామ్‌హౌస్ విస్తరణ, దారికి వినియోగించారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ ఆరోపణలపై రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, ప్రత్యేక విచారణ కమిటీ రంగంలోకి దిగింది.
గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాలు, ఓల్డ్ పాహాణీలు, ప్రస్తుత రికార్డులను పోల్చి భూసర్వేకు సమాయత్తం చేస్తున్నారు. అధికారుల ఈ తాజా కసరత్తుతో వర్గల్ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
