ఇందిరమ్మ బీమా పథకం, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకాన్ని అమలు చేయనుంది. వార్షిక బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి.
ఈ పథకం పూర్తిగా ఉచితంగా అందించబడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది.
ఏ కారణంతో మరణించినా ఈ బీమా సొమ్ము లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
రేషన్ కార్డు ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది.
నవంబర్ 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయి. ఈ దరఖాస్తులను మండల తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరించి పరిశీలిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ బీమా సదుపాయానికి అర్హులని అధికారులు తేల్చారు.
అదే రోజు నవంబర్ 19 నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయని, పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు.

