మద్దూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రతిపాదనలు, NewzFast Telugu (మద్దూరు): కొడంగల్ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మద్దూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రతిపాదనలు, రోడ్డు విస్తరణ బాధితుల సమస్యలను తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
ఈ మేరకు 14 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేసి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వార్డుల్లో మురుగు కాల్వలు, తాగునీటి సమస్యల పరిష్కారం, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
క్రీడా మైదానం, డిజిటల్ గ్రంథాలయం, పార్క్, స్వాగత ద్వారాల ఏర్పాటుతో పాటు నూతన మున్సిపల్, వార్డు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, రోడ్ల శుభ్రత యంత్రాల కొనుగోలుకు కూడా నిధులు అవసరమని పేర్కొన్నారు.
యువత, రైతు కూలీలు, కార్మికులకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ పథకాల అమలులో మద్దూరు ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పాత బస్టాండ్ చౌరస్తా నుంచి కోట్ల ఆంజనేయస్వామి ఆలయం, బాలుర వసతి గృహం, రెనివట్ల రైస్ మిల్లు నుంచి మోమినాపూర్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్ ప్లాట్లు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం అందించాలని కూడా కోరారు. హామీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కౌన్సిలర్లు హెచ్చరించారు.
