ఎన్జీవోస్ కాలనీలో నూతన తాగునీటి పైప్లైన్ ఏర్పాటు, NewzFast Telugu (కరీంనగర్): నగరంలోని కాలనీల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న తెలిపారు.
శుక్రవారం 11వ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో నూతన తాగునీటి పైప్లైన్ ఏర్పాటు విషయమై కాలనీవాసులతో ఆయన సమావేశమై చర్చించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదతో కలిసి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి ప్రతి ఇంటికి మెరుగైన నీటి సౌకర్యం అందించేందుకు నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
