మేడిగడ్డ బ్యారేజీల పునరుద్ధరణ, NewzFast Telugu: కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను సురక్షితంగా తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా లిఫ్ట్ చేయడం లేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికంగా అక్కడి నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని ఇంజనీర్లు వివరించారు.
మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. నిర్మాణ లోపాలున్న ఈ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని లిఫ్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగా, ఈ మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్లు వివరించారు. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు లిఫ్ట్ చేసి మొత్తం 24.81 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకున్నామని పేర్కొన్నారు.
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. బ్యారేజీల భద్రత విషయంలో రాజీ పడకుండా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాల మరమ్మతుల వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్లు వివరించారు.
తుది అనుమతులను ఈ నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పనులను రెండు దశలుగా విభజించి, నీటి వినియోగ సామర్థ్య పునరుద్ధరణతో పాటు రక్షణ పనులు కూడా చేపట్టాలని సూచించారు.
