రామాయణ సినిమా మేఘనాథుడు రాఘవ్ జుయల్, NewzFast Telugu: బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన తొలి భాగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా ముగింపులో రెండో భాగానికి లీడ్ ఇస్తూ హనుమంతుడి పాత్రను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా వినిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది.
ఇక ఎండ్ టైటిల్స్‌లో రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్ అలియాస్ మేఘనాథుడి పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కనిపించారు. ఆయన తెలుగులో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాతో పరిచయమయ్యారు.
అందులో మోహన్ బాబు కుమారుడు విక్రమ్ మాలిక్ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించారు.
‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన డ్యాన్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నటుడు ‘రామాయణ’లో మేఘనాథుడిగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మొదటి భాగంలో ఆయన పాత్రకు సంబంధించిన పరిచయం మాత్రమే ఇచ్చారు. అయితే రెండో భాగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

