మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వివాదం, NewzFast Telugu: ఢిల్లీలో ఇటీవల జరిగిన వివాదంపై గాంధీభవన్‌లో గురువారం జరగాల్సిన విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరుకాలేదు. ఢిల్లీలోని ఒక హోటల్ లాబీలో ఇద్దరి మధ్య జరిగిన గొడవను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వివరణ కోసం పిలిచారు.
గురువారం ఉదయం మంత్రి దామోదరతో, మధ్యాహ్నం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో చర్చ జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో క్యాబినెట్ సమావేశం, ఆరోగ్య కారణాలతో మంత్రి, వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే రాలేమని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి రాకపోవడంతో మహేశ్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్యేను కూడా కలవకుండానే వెనుదిరిగారు.
నోటీసులు ఇవ్వకుండా ఫోన్ ద్వారా పిలవడంతోనే ఇద్దరూ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వివాదం ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో డీసీసీ అధ్యక్షుల నియామకాలు, ఓ నేత ఎమ్మెల్సీ సీటు కోసం పైరవీ చేస్తున్నారనే అంశంపై జరిగిన వాగ్వాదమని ప్రచారంలో ఉంది.
తనను మంత్రి తీవ్ర పదజాలంతో దూషించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు టీపీసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. హోటల్ సీసీటీవీ ఫుటేజీని విచారణలో సాక్ష్యంగా సమర్పించనున్నారని సమాచారం.
ఈ అంశంపై మంత్రి వైపు నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
