బచ్చన్నపేట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు నిరసన, NewzFast Telugu (జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం): డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఇటికాలపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అటువైపు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌ను వారు అడ్డుకున్నారు.
మండలంలోని కొన్నెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు రోడ్డుపైకి వచ్చి వారి వాహనాలను అడ్డుకున్నారు.
నాలుగేండ్ల క్రితం గ్రామసభలో తమకు ఇండ్లు కేటాయించారని, అప్పటి నుంచి అందులో నివసిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల రెవెన్యూ అధికారులు జనగామ జిల్లా కేంద్రంలో లాటరీ పద్ధతిలో 18 ఇండ్లకు డ్రా తీయగా, అందులో తమ పేర్లు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని వారు ఆరోపించారు.
ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని బాధితులు ఆరోపించారు. లాటరీ పద్ధతిని తాము అంగీకరించబోమని, ఇండ్లను వదిలి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై శ్రీకాంత్, పోలీసు బలగాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కాన్వాయ్‌ను పంపించారు.
మహిళలు మొరపెట్టుకున్నా ప్రజాప్రతినిధులు వారి మాటలు వినకుండా వెళ్లిపోయారని బాధితులు పేర్కొన్నారు.

