పోలింగ్ విధుల్లో ఉపాధ్యాయురాలి మృతి, NewzFast Telugu (అనంతపురం జిల్లా, కూడేరు మండలం): అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో గురువారం పోలింగ్ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలింగ్ విధులకు హాజరైన గుంతకల్లు పట్టణానికి చెందిన హరిత గౌడ్ (56) అనే ఉపాధ్యాయురాలు హఠాత్తుగా మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, ఆమె డి.హిరేహాల్ మండలం కాజలూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎస్‌జిటి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు. సహచర సిబ్బంది ఆమెను కూడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
హరితకు భర్త, కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితం కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సుదూర ప్రాంతంలో విధులకు పంపడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
