తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, NewzFast Telugu (భారత్ ఫ్యూచర్ సిటీ): తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించతలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌కు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రతి ప్రతినిధికి లైజనింగ్ అధికారులను నియమించాలని సూచించారు. ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితో పాటు సెక్యూరిటీ అధికారిని నియమించాలని కూడా ఆదేశించారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. సమ్మిట్‌లో రాష్ట్ర ప్రత్యేకతలు, పర్యాటక ప్రాంతాలను ప్రదర్శించాలని, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై చర్చలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు.
తెలంగాణ విద్యావ్యవస్థలోని వివిధ అంశాలు, విద్యారంగంలో వస్తున్న మార్పులపై కూడా చర్చలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నవంబర్ 15వ తేదీ నాటికి సమ్మిట్ ఏర్పాట్లపై పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని సూచించారు.

