గౌతంపూర్ స్మశాన వాటిక కనీస సౌకర్యాలు, NewzFast Telugu (చుంచుపల్లి): గౌతమ్ పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనే ఇక్కడి చేతిపంపు పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు.
చేతిపంపు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారిందని, దానికి మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం వేరే నీటి వనరు అందుబాటులో లేదని పేర్కొంటున్నారు.
దీపావళి సందర్భంగా గతించిన తమ ఆత్మీయులను స్మరించుకునేందుకు బంధువులు సమాధుల వద్దకు వెళ్లి శుభ్రం చేసి, నీటితో అలికి దీపాలు వెలిగించి నివాళులర్పిస్తారు. అయితే స్మశాన వాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఎవరైనా మృతి చెందినప్పుడు ఖననం చేసేందుకు లేదా దహన సంస్కారాలకు అవసరమైన నీటిని కుండల్లో తీసుకెళ్లి చేతిపంపు ద్వారా నింపుకునేవారు. ప్రస్తుతం అది కూడా పనిచేయకపోవడంతో అంత్యక్రియల సమయంలోనూ ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు స్మశాన వాటికకు వెళ్లే రహదారికి సీసీ రోడ్డు లేకపోవడంతో అది ఎత్తుపల్లాలుగా, ఎగుడుదిగుడుగా ఉంది. దీంతో ట్రాలీలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందని స్థానికులు తెలిపారు.
అత్యవసర సమయంలో మృతదేహాలను తరలించేందుకు కూడా అవస్థలు తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చేతిపంపునకు మరమ్మతులు చేపట్టి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు స్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
స్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

