తెలంగాణ కేబినెట్ సమావేశం, NewzFast Telugu (తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, పాలనాపరమైన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణ, ఏర్పాట్లు, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా సమాలోచనలు జరపనున్నారు.
గత మార్చి 16న ప్రారంభమైన 3వ శాసనసభ 8వ సమావేశాన్ని అక్టోబరు 31న ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేయడంతో, అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలపై నూతన ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగం భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల కోసం ఇటీవల తీసుకున్న రుణానికి సంబంధించిన కీలక ఫైలు మంత్రివర్గం ముందుకు రానుంది. నిధుల విడుదల, భూసేకరణ ప్రక్రియ వేగవంతంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, వేగంగా తగ్గుతున్న భూగర్భ జలమట్టాలపైనా చర్చ జరగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు, రైతులకు నీటి కొరత రాకుండా చూడటంపై సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలతో పాటు, ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
