ధాన్యం కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర, NewzFast Telugu (మానకొండూర్): రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేవల్లి రాజలింగం సూచించారు.
మానకొండూరు మండలం ఈదుల్లగట్టపల్లి గ్రామంలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ రెమిడి శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు.
ప్రస్తుత సీజన్‌కు ఏ-గ్రేడ్ రకానికి రూ. 2461, బి-గ్రేడ్ రకానికి రూ. 2441 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన రైతులకు తెలియజేశారు. ధాన్యంలో తేమ శాతం లేకుండా బాగా ఆరబెట్టడంతో పాటు తాలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని కోరారు.
నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోల 600 గ్రాముల చొప్పున మాత్రమే తూకం వేస్తామని స్పష్టం చేశారు. రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని, ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ మీసా సత్యనారాయణ, హాకా జిల్లా అధికారి కృష్ణయ్య, సొసైటీ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
