మాధారం అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం, NewzFast Telugu (ములకలపల్లి, ఖమ్మం): ములకలపల్లి మండల పరిధిలోని మాధారం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ నాయకత్వం వహించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
వర్షం కురిస్తే భవనం పరిసరాలు బురదమయంగా మారి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో చిన్నారులకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ పక్కా భవనాలు నిర్మించకపోవడం బాధాకరమని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. గ్రామంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఒకేచోట నిర్వహిస్తుండటంతో చిన్నారులకు అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన పక్కా భవనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చనగాని వినోద్, పసుల సూర్య, ముదిగొండ రవి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

